7, ఏప్రిల్ 2012, శనివారం

ఆలుగడ్డ ఆళ్లదట!

ఐక్యరాజ్యసమితి మేధోసంపద హక్కుల ట్రిబ్యునల్ ఇటీవల ఒక తీర్పు ఇచ్చింది.
"ఆలుగడ్డ, ఉర్లగడ్డ, బంగాళదుంప, పొటాటో .. మీరు ఏ పేరుతో పిలుస్తారో మీ ఇష్టం కాని దాన్ని నోట్లో పెట్టుకునే ముందు ఒక విషయం తప్పనిసరిగా తెలుసుకోండి. అది దక్షిణ అమెరికా తెగలు కనుగొని పెంచి పోషించి మనకు అందించిన ఆహారం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఆలుగడ్డ విక్రయాల నుండి వచ్చే లాభంలో ఒక శాతం ఆ తెగల వారికి చెందాలి.

క్రీస్తు పూర్వం 3000 - 2000 సంవత్సరాల మధ్య ఆలుగడ్డల్ని మొదటిసారిగా పండించింది పెరూ దేశపు ఆదివాసులు. ప్రపంచంలోని నాలుగో అతి పెద్ద ఆహార పంట సృష్టికర్తలుగా వారిని ఇప్పటికైనా గుర్తించి వారికి దక్కాల్సిన రాయల్టీని వారికి మనం ఇవ్వాలి'' అని ఆ ట్రిబ్యునల్ అధ్యక్షుడు డాక్టర్ దేశిరీ డాఫినాస్ ప్రకటించారు.
ఇది తమకు గొప్ప విజయమని, ఆలుగడ్డ నుంచి రాబోయే డబ్బుతో తాము శతాబ్దాలుగా కోల్పోతూ వచ్చిన భూముల్ని, సహజ వనరుల్ని తిరిగి కొనుగోలు చేస్తామని ఈ కేసును ట్రిబ్యునల్ ముందుకు తీసుకుపోయిన దక్షిణ అమెరికా స్థానిక తెగల కార్యవర్గం (శాంటె) అధ్యక్షుడు జార్జ్ పపాస్ మీడియాలో మాట్లాడుతూ చెప్పారు. మొదటి సంవత్సరమే తమకు 20 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుందని 'శాంటె' అంచనా వేస్తోంది. తమ భూములు తమకు తిరిగి వచ్చాక అమెజాన్ అడవుల్లో పరిశ్రమలు నెలకొల్పుకున్న బహుళజాతి సంస్థలు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి 'ఆలుగడ్డతో వంటలు' వంటి పుస్తకాల ప్రచురణలో తొలి ప్రాధాన్యం ఆ కంపెనీలకే ఇస్తామని 'శాంటె' ప్రకటించింది.
..............................................
నిజమా ... ఈ భూప్రపంచంలో నిజంగా ఇలాంటిదొకటి జరిగిందా అని ఆశ్చర్యపోతున్నారా? నిజంగానే ఇలాంటి ప్రకటన ఒకటి 24 రోజుల క్రితం వెలువడింది. ఆదివాసుల హక్కుల కోసం పని చేసే 'సర్వైవల్ ఇంటర్నేషనల్' అనే సంస్థ దీన్ని విడుదల చేసింది. తర్వాత 'ఏప్రిల్ ఫూల్' అని చెప్పింది కాని వాళ్ల ఉద్దేశ్యం మాత్రం హాస్యం కాదు; హెచ్చరికే.

2 కామెంట్‌లు:

  1. అవుతే 0 ను కనిపెట్టిన మనకి (భారత దేశానికి) ఎంతడబ్బు రావాలి. మనం కూడా ట్రిబ్యునల్ లో కేస్ వేసి ప్రతి దేశం 0 ను వాడుకున్నందుకు గాను భారత దేశానికి ఇంత ఇవ్వాలి అంటే .... అహాహా మనకు అసలు టేక్సులు లేకుండా ఆర్ధిక వ్యవస్థనంతా నడిపేయవచ్చు.

    రిప్లయితొలగించండి
  2. అసలు మనవాళ్ళు పని ఉద్యోగాలు చేయవలసిన అవసరము లేదు. హాఇగా రాజాల ఉండొచ్చు.

    రిప్లయితొలగించండి